Online Puja Services

నాయనార్ల గాథలు - మయిపోరుల్ నాయనారు

18.191.223.123

నాయనార్ల గాథలు - మయిపోరుల్ నాయనారు | Nayanar Stories - Mayiporul Nayanar
లక్ష్మీ రమణ 


తల్లి అనురాగానికి కొలమానాలు ఉంటాయా ? పరమేశ్వరుని ప్రేమ అటువంటి అమ్మ అనురాగం వంటిది. అంతకన్నా మిన్నయినది. సరిహద్దులు లేనిది. అనంతమైనది. అమ్మ బిడ్డడు సరైన దారిలో నడవాలని ఆరాటపడి, దండించినట్టు, సరైనదారిలోనే ఉన్నాడని గ్రహించినా, అప్పుడప్పుడూ పరీక్షలు పెట్టినట్టూ, ఈశ్వరుడు కూడా తన భక్తులకి పరీక్షలు పెడతాడు.  ఆ పరీక్షలకి నిలబడితే జన్మ- మరణముల   చక్ర భ్రమణము నుండీ రక్షించి శాశ్వత ఆనంద ప్రాప్తిని ప్రసాదిస్తాడు.  అంతకన్నా జీవికి కావలసినదేముంది ?  ఒక రాజుగారు అటువంటి ఈశ్వర ప్రేమని అందుకున్నారు .  ఆయనే మయిపోరుల్ నాయనారు .  ఆ దివ్యమైన ఉదంతాన్ని ఇక్కడ తెలుసుకుందాం . 

మయిపోరుల్ నాయనారు మహా శివ భక్తుడు.  నిత్యమూ శివారాధన చేసేవాడు.  శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేయించే వాడు .  నిత్యాభిషేకాలు జరిపిస్తూ ఉండేవాడు . ఆయన రాజ్యంలో ప్రజలందరూ కూడా శివ పూజలు నిత్యమూ చేసేలా , శివారాధనకి లోపం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకునేవాడు .  రుద్రాక్షలు , విభూతి రేఖలూ ధరించిన వారందరినీ సాక్షాత్తూ శివయోగులుగా, శివ రూపాలుగా భావించి గౌరవించేవారు. అణువూ అణువులోనూ మహేశ్వర దర్శనం చేసే రాజు మయిపోరుల్ నాయనారు . 

శివా అని నెత్తిన ఇంత నీళ్లు పోస్తేనే అనుగ్రహించే శివయ్య , రాజ్యమంతా ఏకమై తనని ఆరాధిస్తే కరగకుండా ఉంటాడా ! ఆ రాజుకి, ఆయన రాజ్యానికీ  శివానుగ్రహం మెండుగా ఉంది .  శివానుగ్రహం ఎక్కడుంటుందో అక్కడ సంపదలకు కొదవ ఉంటుందా ? కొండ ప్రాంతాన్ని పరిపాలించే రాజయినప్పటికీ ఆ ప్రాంతంలో కరువు కాటకాలు అనేవి  మచ్చుకైనా లేవు. ఎప్పుడూ ధన్య లక్ష్మీ అనుగ్రహం , ధనలక్ష్మీ అనుగ్రహం నిండుగా మెండై ఉండేది .  దండెత్తిన శత్రువులెప్పుడూ ఆ రాజ్యాన్ని జయించలేదు.  ఆ  విధంగా రాజ్యలక్ష్మీ అనుగ్రహం కూడా శివానుగ్రహం వలన మయిపోరుల్ నాయనారుకి పుష్కలంగా ఉంది.  

శతృదేశాల రాజులకి మయిపోరుల్ నాయనారు సంపదల్ని, సౌభాగ్యాన్ని చూస్తే చాలా కంటగింపుగా ఉండేది.  ఆయన రాజ్యం విస్తరించడం బాధగా ఉండేది .  అటువంటి శతృవుల జాబితాలో మొదటి వాడు ముత్తునాధన్. పొరుగు రాజైన ముత్తునాధన్ కి  ఎంతసేపూ  మయిపోరుల్ ని ఎలా మట్టు పెట్టాలా అనేదే ఆలోచన. అది ధర్మబద్ధమా? విరుద్ధమా అనేది అవసరం లేదు . దాంతో ఆటను ఒక మాయోపాయానికి తెరతీశాడు.  

మయిపోరుల్ నాయనారుకి శివయోగులంటే ఉన్న ప్రత్యేక అభిమానాన్ని తన పగ తీర్చుకోవడానికి మార్గంగా ఎంచుకున్నాడు .  శివయోగిగా వేషాన్ని ధరించి  మయిపోరుల్ నాయనారుని దర్శించడానికి వచ్చాడు ముత్తు నాథన్. అది అర్థరాత్రి సమయం .  ధాతన్ అనే నమ్మిన బంటు రాజుగారి గదికి కాపలాగా ఉన్నాడు.  అతను శివయోగిగా విచ్చేసిన ముత్తునాథన్ ని సాదరంగా ఆహ్వానించి, గౌరవించాడు.  “ స్వామీ ! ఇప్పుడు  రాజుగారు గాఢమైన నిద్రలో ఉన్నారు.  ఉదయం  కూడా విశ్రమించండి.  శివ పూజానంతరం రాజుగారిని కలవవచ్చు”. అని చెప్పాడు.  అప్పుడా మాయా శివ యోగి “ లేదు సైనికా ! నేను అవసరంగా రాజుగారిని కలవాలి. శివాదేశం ప్రకారం నేను ఇక్కడికి వచ్చాను.  వెంటనే ఆయనకీ ఒక మంత్రాన్ని ఇవ్వాల్సి ఉంది . ఆయన నిదుర లేచే వరకూ నేను వేచి ఉండలేను. వెంటనే రాజుగారిని కలవాల”ని తొందర చేశాడు. 

ఇక తప్పదని రాజుగారిని మేల్కొల్పాడు ధాతన్. ఆయన ఆంతరంగిక అభ్యంతర మందిరంలోకి ముత్తునాథన్ ని స్వయంగా తీసుకొని వెళ్ళాడు . అప్పటిదాకా అక్కడే ఉన్న రాణీగారు లోపలికి వెళ్లిపోయారు.  రాజుగారు శివయోగిగా ఉన్న ముత్తునాథన్ ని చూసి దగ్గరికి వచ్చి పాదములకు నమస్కారం చేశారు.  అదే సరైన సమయం అనుకున్న ముత్తునాథన్ వెంటనే తన బట్టల్లో రహస్యంగా దాచిన కత్తిని తీసి రాజుగారిని పొడిచేశాడు. అప్పుడు గుర్తించాడు ధాతన్ వచ్చినవారెవరని ! శతృరాజుని గుర్తించగానే ఆవేశంగా కత్తి దూశాడు. కానీ,   మయిపోరుల్ వెంటనే అతన్ని ఆపేశాడు.  “ ధాతన్ వచ్చినవాడు శతృవే కావొచ్చు.  కానీ, అతను శివయోగిగా మన దగ్గరికి వచ్చాడు .  విభూది రేఖలు,  రుద్రాక్షలూ ధరించిన వారు శత్రువులైనా సరే, వారికి అపకారం తలపెట్టవద్దు .  జాగ్రత్తగా ఈయన్ని రాజ్యం పొలిమేరలు దాటించు. తన రాజ్యం చేరే దాకా రక్షగా ఉండు . ఇది రాజాజ్ఞ” అన్నాడు .  తనకొస్తున్న కోపాన్ని , దుఃఖాన్ని తొక్కిపెట్టి రాజాజ్ఞని పాటించడంలో నిమగ్నమయ్యాడు ధాతన్. 

మయిపోరుల్ తన మంత్రులని, రాజా పరివారాన్ని అత్యవసరంగా సమావేశపరిచాడు. “ఆంతరంగికులారా ! ఆప్తులారా ! మీ రందరూ నా మరణానికి చింతించకండి.  శివపూజకి విఘాతం కలుగకుండా చూసుకోండి.  రాజ్యంలో శివపూజలు నిత్యమూ జరిగేలా జాగ్రత్తలు తీసుకోండి. ఈశ్వర చిహ్నాలైన రుద్రాక్షలూ, విభూది ధరించినవారిని ఎల్లవేళలా గౌరవించండి. అటువంటివాడు ఆగర్భశత్రువైనా, పూజించండి.   ఆ ఈశ్వరుడే మిమ్మల్ని, మన రాజ్యాన్ని, ప్రజలని జాగ్రత్తగా కాపాడతాడు.” అని చెప్పాడు .  రాజాజ్ఞగా శివారాధన కొనసాగించాలని ఆజ్ఞాపించాడు . 

పరమేశ్వరుడు మయిపోరుల్ నిండైన శివ భక్తికి,  శతృవులో కూడా శివుణ్ణి దర్శించిన హృదయానికి ముగ్దుడైపోయాడు.  ఆ స్వామి వెంటనే మయిపోరుల్ ఎదుట ప్రత్యక్షమయ్యాడు.  శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా ! మరి శివభక్తుడైన మయిపోరుల్ జోలికి  శివాజ్ఞ లేకుండా   ముత్తు నాథన్ వెళ్ళలేడు కదా ! ఇదంతా శివ పరీక్షగా స్వామి మయిపోరుల్ కి తెలియజేసి,  “ భక్తా ! అనన్యమైన నీ భక్తి ప్రపత్తులు నన్ను ఆనందింపజేశాయి.  నా పట్ల భక్తితో శత్రుత్వాన్ని కూడా జయించిన నీవు కైలాసంలో నివశించడానికి అర్హుడవు.  నిన్ను నాలోకానికి ఆహ్వానిస్తున్నాను.” అని అనుగ్రహించాడు.  

ఆ విధంగా మయిపోరుల్ నాయనారు అమ్మ అమ్మని నిరంతరమూ అమ్మ వెనకాలే తిరిగే పసి బిడ్డలాగా ,  శివునే నిరంతమూ దానిస్తూ , శివ సాయుజ్యాన్ని పొందారు .  తన ప్రజలందరినీ శివభక్తులుగా మార్చారు . శివారాధనలో తరించి, శివుడే లోకంగా జీవించి, చివరికి ఆ శివలోకాన్నే చేరుకొని ధన్యుడయ్యారు.  కాబట్టి శివారాధన , శివనామస్మరణ కూడా ఎల్లప్పుడూ ఆ శివ రక్షని , శివ సాన్నిధ్యాన్ని అనుగ్రహించే తారకనామాలని గ్రహించాలి . పవిత్రమైన కార్తీకమాసములో, ప్రదోషవేళల్లో ఈ దివ్యమైన నాయనార్ల చరితలని చదువుకోవడం, వినడం, స్మరించడం, మననం చేయడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా శివానుగ్రహాన్ని సంప్రాప్తిపజేస్తాయి అనడంలో సందేహంలేదు .  

శుభం .  

 

Nayanar, stories, Mayiporul, Shiva, Siva, 

Quote of the day

May He who is the Brahman of the Hindus, the Ahura-Mazda of the Zoroastrians, the Buddha of the Buddhists, the Jehovah of the Jews, the Father in Heaven of the Christians give strength to you to carry out your noble idea.…

__________Swamy Vivekananda